Thursday, October 11, 2018

కృష్ణుడు

Oct 11

"కృష్ణుడు! " అంటేనే పరమానందం   ! అందం ఆనందం ,కలబోసిన సుందర సురుచిర భువనైక సమ్మో హన ప్రేమైక శక్తి స్వరూపం.!  భాగవత కథలు వింటుంటే  అంతరంగం లో ,ఎదో తెలియని మదురనుభూతుల కలుగుతుంటాయి..!కృష్ణయ్య రూపం చూసినా, "కృష్ణా  !"అన్న పిలుపు వినినా, కన్నయ్య కథలు ,లీలలు,  అలకించినా, అద్భుతమైన ,అనిర్వచనీయమైన మదురానుభూతులను మనం పొందుతాము..! చిన్నికృష్ణునిపై  "వెన్నదొంగ !" అనే అభియోగం గోపికలు చేశారని విన్నాం !.ఈ "చొరలీల !"లో అద్భుతమైన జీవన సత్యాలున్నాయి ! ప్రతీ హృదయంలో  "ప్రేమ" ఉంది !.ప్రేమ సున్నితమైన ది,  సుతిమెత్తనిది  కూడా ! "వెన్న"లాంటిది !,అది పరమాత్మ వైపు తిరిగితేనే ప్రేమకు  పూర్ణత్వం ! ప్రతీ జీవినీ పూర్ణ స్వరూపంగా మార్చేందుకు పరమాత్మ మన ప్రేమను అపహరిస్తాడు !.అదే చొరలీల!. బ్రతుకుల్లో భారాలను ,ఘోరాలను దూరం చేసే కృష్ణ చొరలీల ," . కృష్ణా ! పాలకడలి ,నీ ఇల్లు !,నీకు పాలు, వెన్న అవసరమా.? నీకు మన్ను అవసరమా? ఇవన్నీ మా కొరకు  ,మూసుకుపోయిన మా కళ్ళు తెరిపించేందుకు ,మా బ్రతుకులోని చీకట్లను తరిమెందుకు ,నీ దివ్యతేజంతో మమ్మల్ని నింపేందు కే కదా  .! నీలమేఘశ్యామా !,గోపీజనహృదయవిహారా! రాధికాలోలా ,.!వేణుగానవిశారదా .!..ఇలాభక్తితో పీలుస్తూ ,కృష్ణలీలల్లో దాగిన అర్థము  ,పరమార్థము కృష్ణుని పై  విశేషమైన భక్తి ప్రేమలు ఉంటేనే గానీ గ్రాహ్యం కావు. ! దూడలు "అంబ !"అని కృష్ణుణ్ణి పిలుస్తాయి  !కర్మబద్ధులైన జీవులు కూడా  "కృష్ణా!,, అచ్యుతా !ఆనంతా!",, అంటూ భక్తి పూర్వకంగా పిలువగానే ,పరమాత్మ అనుగ్రహించి, ముందుగానే కట్లు విప్పి ,కర్మబంధం నుండి విడిపిస్తాడు!. ఇదీ కృష్ణలీలల  అంతరార్థం ! అలాంటి కృష్ణుణ్ణి తమ వీపుపై ఎక్కించుకొని మోసిన గోపాకుల భాగ్యాన్ని  ,ఏమని వర్ణించగలం ? అలాంటి భాగ్యం , సనక సనందాది మహర్షులకు కూడా లభించలేదట   ! అలా అనుక్షణం పరమాత్మ తో సాంగత్యం ,తినడం ,వినడం ,తిరగడం ,ఆడడం  ఈ భాగ్యం ఎవరికి ఉంటుంది చెప్పండి ?..ఇలాంటి దివ్యబోధనల నందించి గోకులాన్ని తరింపజేశాడు నందగోపాలుడు !,యశోదాదేవి గారాల బిడ్డడు !మన చిన్నికృష్ణుడు  ! .సినిమాల్లో కూడా కృష్ణుని గురించిన భక్తి పారవశ్యంతో నిండిన పాటలు మనం భక్తిశ్రద్ధలతో  వింటున్నాం !.శ్రీకృష్ణుడు అంటే ఇలా ఉంటాడు అని NT రామారావు గారిని మాయాబజార్ సినిమా లో చూసి అనుకున్నాం .అప్పడు చాలా మందితో బాటు వెండితెరపై కనిపించే కృష్ణుని కి  నేనుకూడా దండం  పెట్టుకున్నాను .!బాలకృష్ణుని  దివ్యమైన పాండురంగని  ప్రత్యక్ష రూపాన్ని ,ఆర్తితో , భక్తితో   "జయ కృష్ణా !ముకుందా! మురారి !,,,"అంటూ పిలిచిన అమరజీవి  ఘంటసాలగారి కంఠస్వర మాధుర్యానికి ,రామారావు గారి భక్తిపూర్వకసహజనట నా భావుకతకు   , కదిలివచ్చిన  పుండరీకవరదుని రమణీయ మంగలకర సుందర రూపాన్ని మరవగలమా  ? ,,ఎందరో భావ కవులు , దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారి లాంటి వారు , కృష్ణగీతాలు భావ గర్భితంగా రాసి ధన్యులయ్యారు. ! "కృష్ణా  !నీ పేరు తలచినా చాలు ! మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు. ! "" . అంటూ ,ఇంకా,,,,  "మురళీధరా !,నీ స్వరలహరులలో మరణమైనా మదురమురా.. ! "..అంటూ   "ఏమి మురళి !  అది ఏమీ రవళి రా.! పాట వినగ ప్రాణాలు కదలురా.  ! ",,అంటూ భావకవిత్వానికి తన  అంతరంగంలో శ్రీ కృష్ణ ధ్యానంలో  గానంతో ,అద్భుతంగా  కృష్ణ చైతన్యాన్ని  నింపుకొని అరాదించుకున్నాడు .!.ఇలా ఎందరో శ్రీకృష్ణ ధ్యాసలో  ,శ్వాసలో  ,,యాసతో ధ్యానించి, భావించి ,పునీతులయ్యారు..! మీరాబాయి శ్రీకృష్ణ ప్రేమలో భక్తిని పండించుకున్న ధన్యచరిత ! ఆమె కు గల  "కృష్ణప్రేమ "ఆమెలో గల అవ్యాజమైన అనురాగాలకు అద్దం పడుతోంది..లౌకిక.బంధాలకు అనుబంధాలకు దూరమై ,,శాశ్వత, పారలౌకిక పరమానందం కోసం , కృశించి ,తపించి శ్రమించి ,కృష్ణుణ్ణి ఆరాధిస్తూ ,చివరకు శ్యామసుందరుని సన్నిధిని చేరుకుంది.  జగతిలో ,ప్రకృతిలో,నీలాకాశంలో ,చెట్టులో పుట్టలో ,నీటిలో ,ప్రతి ప్రాణిలో చివరకు త్రాగే విషపూరిత పాత్రలో కూడా ఆమెకు శ్యామసుందరుని సుందర వదనారవిందము కనపడింది.!. ఆలా తనువు, మనసు, వంశీదరుని రూప గుణ సౌందర్య లావణ్య వైభవాలతో నిండిపోగా,తన జీవితాన్ని "శ్రీకృష్ణ భక్తి గీతాల మాలిక !"లతో తన ప్రభువు ను అలంకరించి అలరిస్తూ,కృష్ణదాసి లా శోభిస్తూ  కృష్ణప్రేమకు , ,కృష్ణ సేవకు,కృష్ణ భావనకు తన సర్వస్వాన్ని సమర్పిస్తూ ఐహిక సుఖాలు త్యజించి , మరో రాధాదేవి వలె ధన్యురాలు ఐయ్యింది..!" శరణాగతి!" అంటే ఇలా ఉండాలి అని తన కైంకర్యం భావనతో, నిరంతర భజనతో శ్రీకృష్ణుని ఆంతరంగిక పరిచారిక అయ్యింది !.,అలాగే చైతన్య మహా ప్రభువు ,అపర కృష్ణ దాసులై,  "హరికృష్ణ , హారేరామ  !,,అన్న శ్రీకృష్ణ భవ నామ తారక  మంత్రాన్ని ,  ఉద్యమంలా అందించి  ,,,శ్రీకృష్ణ చైతన్యాన్ని  "క్రిష్ణభక్త జనావళికి  అనుగ్రహించాడు!..అదే ఉద్యమ వైభవం ,ప్రపంచంలో ,నలుమూలలా విదేశీయులను కూడా ఆకర్షించి  ,"ఇస్కాన్" పేరుతో  జగత్ ప్రసిద్ధిని పొందుతూ శ్రీకృష్ణభగవానుని దివ్య లీలా వైభవాన్ని శ్రీకృష్ణ ఇస్కాన్ కేంద్రాలు  దేశమంతటా నెలకొల్పి  ,పిల్లలకు  పెద్దలకు ,జాతి మత బేధం లేకుండా చాటుతున్నారు.! ,కృష్ణుడు అంటే హృదయ అంతరాళం లో పాలపొంగులా  భక్తి అనురాగాలు ఉబికి వస్తుంటాయి.! కమనీయము ,కడు రమణీయము ,నయన మనోహరము అయిన ఆ జగన్మోహనాకారుని సుందర రూపాన్ని దర్శిస్తే ,స్మరిస్తే ,పూజిస్తే భావిస్తే చాలు , మనసు ఉప్పొంగి ,తనువు పులకించి , హృదయం ద్రవించి ,స్రవించే  ఆనందాశ్రువులు  ,శ్రీ కృష్ణ స్వామి చరణ కమలాలను  అభిషేకిస్తాయి!"..కృష్ణుడు!" అంటేనే శిఖిపింఛమౌళి,! కస్తూరీ తిలకం, !కంఠంలో ప్రకాశించే కౌస్తుభమణి,! మెడలో వైజయంతి మాల,!చెవులకు మణి కర్ణికా కుండాలాలు!,తళుక్కుమని మెరిసే నాసికాగ్ర నవ మౌక్తికం,! పద్మదళాలను తలపించే  ,కారుణ్యాన్ని కురిపించే విశాల నేత్రాలు,!పసిడికాంతులను విరజిమ్మే నునుపైన కపొలాలు,!శంఖం లాంటి సన్నని మెడ,, !భుజాలనుండి వ్రేలాడే నవరత్న మణి గణ భూషిత వజ్ర వైడూర్య మరకత ఇంద్రనీల మణుల స్వర్ణభూషణాల ఆభరణాలతో శోభిల్లే "నీలమేఘ శ్యాముని, సచ్చిదానంద ఘన శ్యామసుందరరూప లావణ్య వైభవాన్ని  ఎవరికయినా కూడా "వర్ణింప తరమా..? "నారింజరంగు జరీవస్త్రంతో ,ధగధగా మెరిసే బంగారు వడ్డాణంతో ,పట్టు పీతాంబరదారియై, చేతులకు ముంజేతి స్వర్ణ, కంకణాలతో, అరవిందాలను మరపించే కృష్ణయ్య చరణ కమలాల సొగసును  ,ద్విగుణీకృతం చేస్తున్న ముత్యాలు రత్నాలు పొదిగిన స్వర్ణమంజీరాలు....! అరుణారుణ కాంతులను ,కోటిసూర్యసమ ప్రభలను వేదజల్లుతూ భక్తుల ఆర్తిని తీర్చే ,ఒకచేత అభయ హస్తము,  మరోచేతిలో విశ్వంలోని సకల భువన బ్రహ్మాన్దాలను,ప్రకృతికాంతను , తన అద్భుతమైన  దివ్య సుస్వర నాదంతో సమ్మోహనపరచే  వేణువు ను ధరించిన... "జగన్మోహనాకారం "తో శ్రీకృష్ణుని దివ్యదర్శన సౌలభ్య మహా భాగ్య సౌభాగ్యం   సామాన్యులకు అంత సులభంగా లభిస్తుందా ?.పరీక్షిత్తు మహారాజుగారు ,శ్రీమద్భాగవతమును,దీక్ష తో ఏడు రోజుల శ్రవణం చేస్తూ  ,చివరకు దశమస్కంధంలోని శ్రీకృష్ణఅవతార దివ్యాలీలల వైభవం దర్శించే అర్హత పొందుతారు..! కృష్ణరూప దర్శనం ఎంత సులభమో ,కృష్ణయ్య లీలలు అర్థము కావడం అంత దుర్లభం..! అంతటి శ్రీకృష్ణ పరమాత్మ ని ,తన అవ్యాజమైన ప్రేమానురాగాలతో వివశున్ని చేస్తూ కృష్ణుణ్ణి  తన స్వంతంచేసుకున్న రాధాదేవి ఎంత మహానీయురాలో ,దివ్యమైన శక్తి సంపన్నురాలో ,అర్థం చేసుకోవచ్చు ను..! రాధాదేవి శక్తిస్వరూపిని , అయితే కృష్ణుడు చైతన్యం,! ఆమె చందమామ అయితే కృష్ణయ్య వెన్నెల. !ఆమె సూర్యతేజం అయితే కన్నయ్య దానినంటు పెట్టుకున్న వేడిమి..! ఇలా ఒకరికొకరు విడదీయరాని అనుబంధ అనురాగ  అమృతప్రేమైక స్వరూపులు.. !రాధయే మాధవుడు.!. మాధావుడే రాధ !.గా భాసిల్లే చిదానంద చైతన్య మూర్తులు..! ముఖ్యంగా ,రాధారాణి ప్రసక్తి లేకుండా కృష్ణుని దివ్యాలీలా వైభవం అసంపూర్ణమే..! రాధ లేకుండా కృష్ణుడు లేడు.! అలాగే కృష్ణయ్య ఉన్నచోటే రాధమ్మకు నిలయం..! రాధాకృష్ణుల సంబంధం, ఆనంతము,! అద్భుతము ! "వారిది  అద్వితీయమైన ప్రేమ సామ్రాజ్యం..!" రాధ ఒక దేవత కాదు..! స్వరూపం ,ఆకారం గాని లేదు..!ఆమె  ఒక శక్తి స్వరూపం  !కృష్ణావతారం సందర్భంగా కృష్ణుని విడిచి ఉండలేని విరహతాపంతో తన గోలోకం వీడి ,,గోపీ,గోపికల అవ్యాజమైన కృష్ణప్రేమను కరుణించడానికి  దివి నుండి భువికి దిగివచ్చిన ప్రేమైక రూపిణి రాధాదేవి.! రాసలీల వైభవంలో ప్రవేశానికి ,గోపికలకు   యోగ్యతను కల్పించి. తద్వారా మోక్షాన్ని అనుగ్రహించిన " పరదేవత " రాధ . !కృష్ణునితో గోపికల ను  ఆటపాటల ద్వారా అలరించి, వారి పూర్వజన్మ పుణ్యఫలాలను తొలగించింది  !.అలాగే , కృష్ణుడు అదృశ్య రూపంలో,దూరంగా ఉన్నపుడు ,పొందిన " క్రిష్ణ విరహవేదన " దుఃఖంతో వారి పూర్వజన్మల పాపాలను క్షాళన చేస్తూ..వారి పాపపుణ్య రహిత జీవితాన్ని  రాసలీల అనబడే బ్రహ్మానందవైభవంతో గోపికలను ఉద్దరిస్తూ తన అపార మైన కారుణ్యాన్ని  అనుగ్రహించింది  రాధ ! కృష్ణుడు ఎదుట ఉంటే దర్శనం ఒక్క చోటనే.. కానీ ,కృష్ణుడు కనబడటం లేదు అంటే కలిగే బాధ, దుఃఖం ,పరితాపం ,ఆవేదన ,అక్రందన ,ల ఉద్వేగంతో విరహ అతిశయంతో నల్లనయ్యను  బృందావనం లోని చెట్టు చేమలు లతలు పొదరిండ్లు గాలిస్తూ. అంతటా కృష్ణలీలల దర్శనం చేశారు  అంటే కృష్ణ సంయోగంలో కంటే కృష్ణ వియోగంలోనే  దుఃఖించడం వలన ,వారి పాపాలు తొలగి, కృష్ణానుగ్రహానికి  పాత్రులయ్యారు. అనగా రాధాదేవి కృపా వీక్షణాలు లేకుండా ,ఆమె అనుగ్రహానికి నోచుకోకుండా నేరుగా కృష్ణవైభవ దర్శన అనుగ్రహానికి ఎవరూ పాత్రులు కాలేరు కదా !..రాధాకృష్ణుల విహార స్థలం మన భారత భూమిలో ని మధుర లోని  "మధురమైన బృందావనం !" అది పరమ పావన పుణ్యభూమి !,అపర గోలోక దివ్యత్వాన్ని అపాదించుకొంటూ ద్వాపరయుగం నుండి  ,నేటికీ  కూడా రాధాకృష్ణుల అపూర్వమైన ,అపురూపమైన ,అనంతమైన ప్రేమసామ్రాజ్య వైభవ కాంతులను వేదజల్లుతూ  రాధాకృష్ణుల దివ్యచరితలను వేనోళ్ళ ప్రస్తుతింప బడుతుంది..!ఇంత గొప్ప అమృతమయి,ప్రేమస్వ రూపిణిి ,మాధవుని హృదయ  ప్రేమసామ్రాజ్ఞి  ,"రాధ  !"అనే రెండక్షరాల  పదంలో లో.అద్భుతమైన మహాత్మ్యం ఉంది..!సూర్యకిరణాలు పైనుండి క్రిందకు ప్రసరించి ,మన కంటినిి చేరుతాయి. కదా  !అది "ధార ! "అనుకుంటే  ఈ వెలుగును ఆధారం చేసుకొంటూ ఆరాధనా భావం తో  ,కంటినుండి వెలువడే ,అంటే అదోముఖ స్థానం నుండి ఊర్ధ్వ గతిని ,సూర్యబింబాన్ని   తిలకించడానికి  వెళ్లే జ్ఞాన ప్రకాశాన్ని "  రాధ !" అంటారు  .!.యోగశాస్త్రం దృష్ట్యా ,మూలాధారం నుండి జాగ్రతమై  అజ్ఞాచక్రం లోని సుషుమ్నా నాడితో కలిసి సహస్రార చక్రాన్ని చేరే కుండలినీ శక్తి స్వరూపాన్ని  "రాధ  !" అని కూడా పిలుస్తారు!.. కృష్ణునిభక్తి  హృదయం, రాధాప్రేమ తత్వం ! వానిని వేరుగా చూడలేము..!  ప్రాణం లేకపోతే ఈ శరీరం ఉండదు ! అలాగే రాధ లేకుండా భాగవతం ఉండదు.! .మనలో ఐహిక విషయ వాంఛలు  తొలగితేనేగానిే  ,రాధాదేవి తన ఆచంచలమైన కృష్ణభక్తిని , మనకు ప్రసాదించదు  ! ఈ రహస్యం బృందావన వాసులకి బాగా తెలుసు ! కృష్ణభక్తి ఉన్నవారికి మాత్రమే రాధాదేవి తత్వం తెలుస్తుంది.! బృందావనం లో ప్రతి ఒక్కరు  "రాధే !రాధే !",,అంటూ సంబోదిస్తూ ఒకరినొకరు  పలకరించుకుంటూ ఉంటారు.! ఆటోబండి  తొలేవాడి దగ్గరనుండి , వ్రజవాసులు అందరూ,"" రాధే  ,,రాధే ,,!"అనే నామజపం ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటారు !.రాధాకృష్ణులు ద్వాపరయుగంలో నడయాడిన పుణ్యభూమి ఈ బృందావనం..!యాత్రకు వెళ్లిన భక్తులు అక్కడి మట్టిలో దొర్లుతారు. ఎందుకంటే కృష్ణయ్య కాలి ధూళి సోకిన పవిత్రమైన ధరిత్రి  ఈ పావన బృందావన  భూములు..! ఇక్కడ వీచే గాలి,సోకిన ప్రాణులు,చెట్టు, చేమలు జనులు ,ధన్యులు కదా !రేపల్లెలో ఉండగా , కృష్ణుడు ఏ ఆయుధం పట్టలేదు..! పరమాత్మ స్వరూపంలో వారిని అనుగ్రహించాడు,మధురకు వెళ్ళాక కంస సంహారం తో శంఖు చక్ర గద, ఖడ్గాది ఆయుధాలను దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణకై ఉపయోగించాడు శ్రీకృష్ణుడు..!  కేవలం గోపగోపికల హృదయాలలో నిండిన తన పట్ల గల నిష్కల్మషమైన  ప్రేమను .తన వేణునాద మాధుర్యంతో ద్విగుణీకృతం చేస్తూ ,పరవశిస్తూ , వారికి శాశ్వతమైన  బ్రహ్మనందాన్ని తన సన్నిధిలో వారికి సాక్షాత్కరింప జేశాడు.!అనగా  ముక్తసంగులను చేశాడు..!  "బృందావనం, ఒక దివ్యభూమి !" ఇప్పటికీ సిద్ధులు యోగులు అచ్చట కృష్ణజపంతో క్రిష్ణ సాక్షాత్కారం కోసం , సంచరిస్తూ ఉంటారు.!అలా  "కృష్ణప్రేమ" లో భక్తిని పండించుకున్నవారికి ,రాత్రి వేళల్లో  రాధాదేవి  కాలి అందెల సవ్వడులు వినబడుతాయని ప్రతీతి ,! అంటే"ఇప్పటికీ ఇది  రాధాకృష్ణులు విహరించే గోలోక స్వర్గ ధామం ! ఈ వ్రజభూమి "!అని కదా  అర్థం !శ్రీకృష్ణ భగవానుడు మ్రోగించే భువనమోహన వేణువు లో ,అతని పెదవుల మధ్య నుండి  సున్నితంగా   వెలువడుతూ ,,వేణువుకు గల సప్త రంధ్రాల ద్వారా, అద్భుతమైన రాగమాధుర్యంతో  వివిధ స్వర గతులలో మోహనంగా ,పలికించే  వాయుతరంగాలే రాధాదేవి ఉనికిని సూచిస్తూ ఉంటాయి. మాధవుని ఉఛ్వాస నిశ్వాసాలే ,ప్రాణవాయువుగా వేణువుగుండా వెలువడుతూ  రాగభావ తాళ లయ గతుల సమ్మేళనా రీతులతో  చేసే మురళీ గానం తో, రేపల్లెలో ని మొక్కలను చెట్లను ,గోప గోపికల ను ,  లేగదూడలను, ఆవులను, పశువులను,, అక్కడ పారుతున్న యమునా నదీ మ మాతను ,ఇలా ప్రకృతి కాంత పులకించి పరవశించినదని పోతానామాత్యులు తన భాగవత దశమ స్కందము లో వర్ణించారు.. ! ఇలా ఎంత చెప్పుకున్నా కూడా తనివితీరని అనంత అద్భుతవైభవ గుణ సంపన్నుడు మన శ్రీకృష్ణుడు...!" కృష్ణా  ! రాధాలోలా  ! నీ లీలలు బ్రహ్మాదులకైనా పొగడ తరముకాదు కదా. !  నిరంతరం ,ఇలా నిన్ను స్మరించి ,భజించి, తరించే భాగ్యాన్ని  మాకు అనుగ్రహించు..!  అమ్మా ! రాధమ్మ  తల్లీ ! ,, నీవైనా కనికరించి కన్నయ్యకు నచ్చజెప్పు !  నీ,కృష్ణ సందర్శన ఆసక్తులకు  నీ,భక్తులకు , మీ పై అవ్యాజమైన ప్రేమానురాగాలు, ఆచంచమైన భక్తిశ్రద్దలను అనుగ్రహించేలా , మమ్మల్ని  దీవించాలని ,నీ పాదకమలాలను ఆశ్రయిస్తూ, నిన్ను వేడుకుంటున్నాము ..!. బృందావనవిహారులు శ్రీ రాధమాధవులకు జై  ! జై ,శ్రీ రాధే  ! జై శ్రీకృష్ణ ,! స్వస్తి !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...