Nov 12, 2018
చల్లనయ్య కృష్ణయ్య మన నల్లనయ్య చిత్రాలు చూసినా ,కృష్ణ లీలలు విన్నా, కృష్ణ భజనలు చేస్తున్నా ,చిన్ని కృష్ణుని లీలలు తలచినా,కృష్ణఅష్టమి నాడు చిన్ని కృష్ణుని వేషంలో బాలలు కనిపించినా కలుగే మధురానుభూతులు ,మన జన్మను తరింపజేసే అద్భుతమైన దివ్యానుభవాలు !!.. చాలామందికి కృష్ణుడు దేవుడు కదా ,మరి ఈ నల్లని రంగు పులుముకొని ఎందుకు అవతరించినట్టు.! సకల దేవతలు ప్రకాశంతో తెల్లగా మెరిసిపోతుంటే మన కన్నయ్య చల్లనయ్య ,ఇలా నల్లనయ్య గా ఎందుకు దర్షింప జేస్తున్నాడు.? . అన్నది సకలకృష్ణ భక్తులకు కలిగే సాధారణ సందేహం.!. కృష్ణుడు అంటేనే మాయా స్వరూపం ,అంతా విష్ణుమాయ. ! అతడి నీలం రంగు ఒక మాయ.! అసలు రూప దర్శనం లభించాలంటే ఈ మాయ తొలగాలి .,కృష్ణావతారం సందర్భంలో ఎన్ని అద్భుతాలు బాహాటంగా అందరికీ దర్షింప జేసినా కూడా ,,కృష్ణుణ్ణి సాధారణ గొల్ల పిల్లవాడి గానే తలచారు.. అదే కృష్ణ మాయ ! దేవుడని నమ్మినవారు ,తెలిసినవారు భీష్ముడు ఆక్రూరుడు లాంటి నిజమైన జ్ఞానులు శ్రీకృష్ణ భక్తులు మాత్రమే ! నిజానికి శ్రీకృష్ణుని నీలమేఘశ్యామసుందర రూపమే కాదు ,అతడి బాల్య లీలలు, క్రీడలు ,చేష్టలు ,చరితల అంతరార్థం ,పరమార్థం అర్థం జేసుకోవడం సామాన్యులకు సాధ్యము కాదు ! అంతటి శుక శౌనకాది మహమునులకు ,నారదాది మహా భక్తశిఖామణులకు. అన్నమయ్య మీరాబాయి ,జయదేవుని లాంటి కృష్ణభక్తాగ్రేసరులకు కూడా వర్ణించడానికి ,ఊహించడానికి కూడా తరము కాలేదు ! బాలకృష్ణుని ముగ్దమోహన స్వరూపాన్ని చూడాలన్న కుతూహలంతో, సాక్షాత్తు పరమశివుడు ఉమా సమేతుడై ,రేపల్లెలోని నందగృహం ముందు పడిగాపులుపడుతూ ,చివరకు యశోదాదేవి చంకలో ఒడిగిపోతూ ,ఏమీ ఎరుగని పసిబాలుని వలె నటిస్తూ, జంగమదేవర వేషంలో ఉన్న హరుని చూస్తూ , బెదిరినట్లు కన్నులు త్రిప్పుతూ ,, తల్లికొంగు చాటున నుండి దొంగచూపులు చూస్తూ,, ఉండే నల్లనయ్య అందచందాలను ఎంత చూసినా శివయ్యకు తనివితీరడం లేదు.!ఆ నల్లనయ్య అందాలు అంత మోహనం గా ఆకర్షిస్తూ ఉంటాయి.". ఏమి అందమది..! ఆ నల్లని నీలమేఘశ్యామవర్ణంలో ఎన్ని కాంతులో.! ఎన్ని సొగసులో! ఎన్ని వర్ణాలో! కలువలవంటి ఆ పెద్ద పెద్ద కన్నుల్లో ఎంత చల్లదనం.! ఎంత వైభవం.!. ఏమా మోహనకారం.! చిన్ని కృష్ణునిపై నుండి తన చూపులు త్రిప్పుకోలేకుండా పోతున్నాడు భవానీ శంకరులు. !ఎంతచూసినా తనివితీరని ఆ నల్లనయ్య అందచందాలు శివయ్యనే కాదు.,, రేపల్లెలోని ఆబాల గోపాలం వశీకరణమంత్రం వేసినట్టుగా మంత్రముగ్దు లౌతున్నారు..! మహావిష్ణువు ధరించిన అవతారాలు శుక్ల పాడ్యమి నుండి పౌర్ణమి వరకు చంద్రుని లో కనిపించే చంద్రకళలు వంటివి అయితే . శ్రీకృష్ణ అవతారం మాత్రం సంపూర్ణ చంద్రుని స్వరూపం.!. షోడషకళా పరిపూర్ణుడు శ్రీకృష్ణుడు.! .అలాగే శ్రీరాముడు కూడా "! ""పుంసాం మోహన రూపాయ !" అనినట్లుగా పురుషులకు కూడా మోహాన్ని కలిగించే దివ్యమంగళ ముగ్దమోహన విగ్రహము , శ్రీరామచంద్రుని ధర్మావతారరూపం !శ్రీరాముని అరణ్యవాస దీక్షలో కనిపించిన మునులు ఋషులు యోగులు ,రామయ్యను దర్శించి పరవశం చెందుతూ ," , ఆహా!ఆ చందమామ అందాన్నికూడా ధిక్కరిస్తున్న శ్రీరాముడు లాంటి అందగాడు మాకు కూడా భర్త అయితే ఎంత బావుండేది !అని భావించారట. ! భక్తుల అంతర్యాన్ని తెలిసిన శ్రీరాముడు అలాగే కృష్ణావతారం లో వారిని గోపికలుగా అవతరింపజేసి వారిని కరుణించాడు శ్రీకృష్ణభగవాను డు.. !!అసలు గోపికలకు కూడా అంతుచిక్కని అందచందాలు నల్లనయ్యవి. !చిన్నికృష్ణుడు మధురకు వెళ్లేవారకు వారంతా కృష్ణుని తో కలిసి తిరిగినా రోజుకొక భంగిమల్లో కృష్ణవైభవాన్ని "ఇది " అంటూ ""ఇలా ""ఉంటాడు అంటూ చెప్పలేని సోయగాలు ఆ నల్లనయ్యవి !.. కృష్ణునితో కలిసితిరుగుతూ ,బృందవనం లో "నీవే నేనై ,నేనే నీవై ,నీకు నాకు బేధం అనేదే లేకుండా "" యమునానదీ ఇసుకతెన్నెలపై , పున్నమి వెన్నెల కాంతుల్లో , తనివితీరని కౌతుకంతో ,నల్లనివాని త్రిజగన్మోహన రుపాన్ని కన్నార్పకుండా ఇంతలేసి కన్నులతో చూస్తూ.కృష్ణయ్య మ్రోయించే మురళీనాదంలో ,భువనైక సమ్మోహన మదురనుభూతులతో ఆనందామృత పానం చేస్తూ , యశోదాదేవి లోగిళ్ళలో నందగోపుని లాలనలో ముద్దుగారే యశోద ముంగిట ముత్యములా భాసిస్తూ , తన కృష్ణమాయా జాలంతో సమ్మోహనాకారం తో , అందరి మతులను చెదరగొడుతూ ,అమాయక పసిబాలునివలె తల్లి చెంగు పట్టుకొని తిరిగే ""నల్లనయ్య "ను ,గురించి లీలగా కూడా భావించె లేకపోయారు గోపికలు ..!కాలచక్ర భ్రమనంలో రాత్రిపగళ్లు తెలియక తమ అస్తిత్వం మరిచి పోయి , కృష్ణుణ్ణి ఎప్పుడూ చూస్తూ కూడా , అతడి రూపగుణ వైభవాలను గూర్చి ఏమాత్రం కూడా చెప్పలేకపోయారు గోపికలు. !కృష్ణుని కళ్ళు మాత్రమే ఒక గోపిక చూడగలిగితే.. మరొక గోపిక విశాలమైన ఫాలభాగంలో, ధగధగా మెరిసే కస్తూరీ తిలకాన్ని మాత్రమే చూస్తుంటే.,తళతళ మెరిసిపోయే కన్నయ్య కపోలాలపై నుండి తన దృష్టిని తిప్పుకోలేని స్థితిలో ఇంకో గోపిక..!,మోహనవంశీ నాదం తో తన్మయత్వం చెందే మరో గోపిక ,!,ఎర్రని లేత పెదాల పై చిందే చిరునవ్వు చూస్తూ మరొకరు!. శంఖం లా ప్రకాశించే కంఠాన్ని చూస్తూ ఒకరు.! విశాల వక్షస్థలాన్ని !,తళుక్కుమంటూ మెరిసే చెవులస్వర్ణ కుండలాలను చూస్తూ ఒకరు...!ఒక్కసారిగా రాధమాధవుడు ,గోపీజనహృదయ విహారుడు ,భక్తజన మందారుడు ,మురళీ గాన వినోదుడు ,లీలామానుష విగ్రహుడు, శ్యామసుందరుడు మన నల్లనయ్య ,వారిని ఆటపట్టించాలని , కొంతసేపు కనుమరుగు కాగానే, "అయ్యో ! నేను కన్నయ్య. సంపూర్ణ ముఖారవింద దర్శనా నంద భాగ్యానికి నోచుకోక పోయానే ,నందగోపుని పూర్తిగా చూడలేక పోయానే. బ్రహ్మదేవుడు ఈ రెప్పలను అడ్డుపెట్టి నల్లనయ్య జగన్మోహన సౌందర్య లావణ్య సోయగాలు తనివితీరా మనసారా పూర్తిగా చూడనివ్వడం లేదే. ! ఎంత నిర్దయుడు ఆ విధాత ! మా రెండు కళ్ళలో నిండుగా మెండుగా దండిగా యశోదా నందనుని మన్మదాకార ముగ్ద మోహన రూపమును కదలకుండా ,ఎటూ పోనీకుండా నిలుపుకొని ఆనందించాలన్న ఆర్తిని అభిలాశను ,గోపాలకృష్ణా ,కరుణించి ప్రసాదించు మమ్మల్ని ఈ అపార మైన దయతో పాలింపుమురా ! గోవిందా ! నీ ప్రేమామృత చూపులతో లాలింపుమురా , మురళీ మనోహరా ! భక్తచిత్త మానస చోరా., ! కనికరించి మమ్ముల బ్రోచే భారము నీదేనురా గోపీ కృష్ణా !అంటూ విలపిస్తూ ,క్షణమైనా కృష్ణుణ్ణి తమ ప్రియతముని విడిచి ఉండలేని విరహవేదనతో, తపించే గోపికల నిశ్చల నిర్మల అకుంఠితభక్తిని నిజమైన భక్తిభావ సంపదగా శ్రీకృష్ణుడు స్వీకరించి వారికి కైవల్యాన్ని అనుగ్రహించాడు .. ! ఇలా నీలమేఘశ్యాముని దేహంపై నున్న ఒక్కొక్క అవయవ సంపద సౌందర్యాలను చూస్తూ, వివశులై ,అత్మానందం పొందుతూ, తమను తాము మరిచిపోతూ, జీవాత్మ పరమాత్మ సంయోగం లా నల్లనయ్య శ్యామల వర్ణంలో లో బంగారు కాంతులతో శోభలు వెదజల్లే మహాలక్ష్మి లాంటి రాధాదేవిి ,,శబ్దంలో స్వరంలా ,వేడిమిలో వెలుతురులా లీనమయి పోయింది ! అందాల ఆనందాల నల్లనయ్య జగన్మోహనాకారం పూర్తిగా చూడడానికి ఎవరికీ వీలుకాలేదు..! త్రిభువనాల లోని సౌందర్యం అంతా ఒకచోట కుప్పపోసి న అద్భుతమైన, అపురూపమైన, ఆనందకరమైన, అద్వితీయమైన, అనురాగబందాన్ని , సమస్తజీవులలో కలుగజేస్తూ, కోటిసూర్యసమ ప్రకాశంతో కాంతులు విరజిల్లే శ్రీకృష్ణ పరమాత్మ సచ్చిదానంద దివ్య మన్మదాకార మంగళ విగ్రహ వైభవాన్ని మాటలలో ఎవరికైనా గాని ,వర్ణించతరమా. ? శ్రీకృష్ణపరందాముని అపురూప రూపలావణ్యాలను ఎంత భక్తిపరవశత్వం తో నైనాగానీ , అంత సులువుగా ,చేతల్లో, చిత్తంలో ,హృదయంలో , చిక్కించుకునే యోగ్యత కలగడానికి ఎంత పుణ్యం , ఎంత తపస్సు ,ఎంత ఆర్తి, ఆవేదన ఉండాలి..! నల్లనయ్య లో ఉన్న ఆ ""నల్లధనం" లో ఎంత "చల్లదనం "ఉందొ ,ఆ పరమ భక్తులైన గోపికల కు మాత్రమే ఎరుక..! ఆ గోపికాలోలుని కే ఎరుక..! అపార భక్తి విశారదులు , నారదాాది గంధర్వ గాన కోవిదులకే ఎరుక ! కృష్ణప్రేమ అనుభవైకవేద్యము ! భక్తి రసమృత ప్రవాహము శ్రీకృష్ణ చైతన్యము..! భువిలో దివిలో నల్లనయ్య సుందర రూప లావణ్యాల కు మోహితుడు కాని వారెవరు ? నల్లనయ్య భువనమోహన సుస్వర వేణు గాన సమ్మోహన శక్తికి పరవశుడు కాని వారెవరు ?,కమ్మని ,తీయని తమ గానామృతం తెలుగులో పాటలను పాడి వినిపించి మనలను తన్మయులను చేసిన "పి. సుశీల " గారు మన నల్లనయ్య రంగు కలదే..కదా !వేల హిందీ పాటలు పాడి, హిందీ సినిమారంగాన్ని ప్రపంచచరిత్రలో ప్రముఖంగా నిలిపిన " లతా మంగేష్కర్ గారు " "మన నల్లనయ్య రంగే కదా. !" వారి రసరాగ సంగీత భరితమైన కళాత్మక నైపుణ్యాలను సూచిస్తాయి వారి కోయిల స్వరాలు , !అందువల్ల , మన ఒంటి రంగు నల్లగా ఉండడం కాదు..,,,హృదయాల్లో , నిర్మలత ,నిష్కల్మష భావం ఉండాలి ,. లోపల మనసు , హృదయం బుద్ది స్వచ్చంగా ,పవిత్రంగా సాత్వికంగా ,సౌశీల్య వంతంగా ఉండాలి.! ""మనిషికి ధనం, అతడి గుణం !అంతే కానీ ,,శరీరవర్ణం కాదు కదా.. !ఆకాశంలో తేలియాడే నల్ల మబ్బుల్లో ఎన్ని అందాలు. చూస్తున్నాం !అసలు ఆకాశానికి రంగు ఉంటుందా ! రంగు మనిషికే కానీ మనసుకు కాదు కదా !అది ఆనంతము !ఆద్యంతము లేని పరమాత్మ దివ్యత్వము ! మన నల్లనయ్య అందం కూడా ఆనంతమే !అద్భుతమే.. కదా ! రేపల్లెలో ,యశోధమ్మను , ఒకసారి మన కన్నయ్య నే అడిగాడట ,,, "అమ్మా !!"నేను నల్లగా ఉన్నానని వీరంతా అంటున్నారు !ఈ రాధ ,ఆ గోపాగోపీజనాలు అందరూ తెల్లగా, ఉన్నారట ! ఇంకా నీవు ,తండ్రిగారు కూడా తెల్లగా ఉన్నారట !. మరి నేను ఎందుకు ఇలా నల్లగా పుట్టాను , ,,అమ్మా !!అసలు నేను. నీ కొడుకునేనా ?? అమ్మా !... అంటూ బుంగమూతితో , దొంగ ఏడుపు తో , అడుగుతున్న కొడుకు అలుకను చూసి నవ్విందట ! పాపం ! పిచ్చితల్లి ! ఆమెకు మాత్రం ఏం తెలుసు ? నల్లనయ్య తన కొడుకు కాదని ! దేవకీ వసుదేవుల అష్టమ సంతానమని !!?? కన్నయ్యను ఒడిలోకి తీసుకొంటూ ,యశోదా మాత. అంది ,,నాన్నా !నా పిచ్చితండ్రీ ! బంగారు కొండా !!నా బుజ్జి కన్నయ్యా ! ఎవరన్నారురా నీవు నల్లనయ్య వని ?? అదిగో చూడు !,, ఆకాశంలో మెరిసే ఆ చందమామ కంటే ,గొప్ప అందం రా,, నాన్నా నీది. !!చూడు. ! ఇక్కడున్న నీ తోటివారిలో నీ అంత "చక్కదనాల చుక్క "ఎవరైనా ఉన్నారా ? చూడు. ! లేరు కదూ ! వీరే కాదురా కన్నా ,. ఈ భూమండలంలో నిన్ను మించిన అందగాళ్లే లేరు !అయినా , వీరంతా నీ కున్న అందం తమకు లేదని అసూయతో నిన్ను నల్లనయ్య అంటున్నారు. ! తెలుసా ! కన్నా ! నాన్నా ! అయినా ఈ గోపికలు అంతా ,ఎప్పుడూ తమ కాటుక కళ్ళతో కన్నార్పకుండా అదేపనిగా నిన్ను తమ కళ్ళల్లో పెట్టుకుని వెర్రిగా , , నిన్నే చూస్తుంటారు కదా !అందుకే వారి కళ్ళ కాటుకదనం ,నీ బంగారు మేనిపైపడి ,నీవు నల్లగా కనిపిస్తున్నావు రా నా చిన్నికృష్ణా ! నా కన్నతండ్రీ ! నా వరాలమూట ! ఉండు ! ఇరుగుపొరుగు వారి దృష్టి నీకు సోకకుండా దిష్టి తీస్తాను ! రారా మా పుణ్యాల పంట ! ""అంటూ ముద్దులకృష్ణుని దగ్గరకు తీసి, చంక కెట్టుకొని, బుగ్గలపై ముద్దుల వర్షాన్ని కురిపిస్తున్న ఆ మహా భాగ్య వంతురాలు అయిన ఆ యశోదాదేవి సౌభాగ్యానికి అదృష్టానికిి శతకోటి ప్రణామాలు సమర్పించకుండా ,,వేనోళ్ళ పొగడకుండా ఉండగలమా..? సమస్త భువనాలను తన బొజ్జలో నిడుకొని కూడా ,,యశోదామాత ,తాను గతజన్మలో చేసిన పుణ్యఫలమంతా ఇలా నల్లనయ్య రూపంలో , రాశీ భూతమై ,ఆమె ఒడిలో స్తన్యపానం చేస్తున్న బాల శిశువులా అవతరించి ,ఉద్భవించి , ఆమెకు మహదానందంగా ,,సాక్షాత్తు మహావిష్ణువును పెంచి పోషించే తల్లిగా ,, అపురూపమైన మాతృవైభవాన్ని ఆమెకు అనుగ్రహిస్తున్న నల్లనయ్యకు మనసా శిరసా వచసా సాష్టాంగప్రణామాలు అందించకుండా ఉండగలమా..? " కృష్ణం వందే జగద్గురుమ్.! శ్రీకృష్ణం వందే జగద్గురుమ్ ! "" కురుపితామహుడు కురుక్షేత్ర యుద్ధరంగం లో ,కేవలం , శ్రీకృష్ణుని దివ్యమంగళ విగ్రహ రూప దర్శనాన్ని ఎదురుగాి వీక్షించేందుకు మాత్రమే ,కౌరవుల కు అండగా ఉంటూ , 11 రోజులు అర్జున రథ సారథిగా, ప్రత్యక్షంగా పరమాత్ముని దర్శించి తరించే నిమిత్తం , భీష్మఆచార్యుడు యుద్ధంలో సంకల్పించారు. ! ఆయనకు మాత్రమే నల్లనయ్య అవతరించి న అసలు కారణం తెలుసును !శ్రీకృష్ణుడు సాక్షాత్తు "మహావిష్ణువు అవతారం !'అని కూడా తెలుసు. !.అందుకే తీవ్రమైన బాణాలు వేసి అర్జునుని , శ్రీకృష్ణుని చాలా నొప్పించాడు !ఆయుధం పట్టనని అన్న క్రిష్ణ శపథం వమ్ము చేసేందుకు.!! తనకి కృష్ణుడు . కృపతో కైవల్యాన్ని ప్రసాదించేందుకు ! అప్పడు ,పార్థసారథి ,ఇక తాళలేక ,రథం దిగి అక్కడే పడివున్న రథచక్రాన్ని చేత ధరించి ,",చూడు ! అర్జునా !"ఇప్పుడు నేనే ఈ భీష్ముని చంపేస్తాను ! " అంటూ తనకేసి కోపంగాచూస్తూ వస్తున్న శ్రీకృష్ణపరమాత్ముని దివ్యమంగళ కర రూప సౌందర్యాన్ని చూసి ,భక్తితో పరవశిస్తూ , విల్లు బాణాలు క్రింద పడేసి అద్భుతంగాి. స్తుతిస్తాడు శ్రీకృష్ణుని ,ఆ భక్తశిఖామణి ! వాసుదేవుని ఆ సౌందర్య దివ్య దర్శనా వైభవ మహా భాగ్యాన్ని. శ్రీకృష్ణుని పరమ భక్తులు మాత్రమే అనుభవింప గలుగుతారు కదా ! మన నల్లనయ్య నీలమేఘశ్యామ రూపలావణ్య సొగసులను , సౌందర్యమును, అంతరాళంలో రమిస్తూ ,అహం బ్రహ్మో స్మి అని భవిస్తూ , అంతఃకరణశుద్దితో దర్శించగలుగుతారు. ! బృందావనం లో ,దివ్యలోకంలో , గోపికలు , నందబాలుని సాన్నిధ్యంలో , ఆడుతూ పాడుతూ ఆనందపరవశులై ఉండగా ,అకస్మాత్తుగా అంతర్ధానం అయిన నల్లనయ్య ను కానలేక ,క్షణమైనా కన్నయ్య విరహాన్ని ఓపలేని గోపికలు నిజంగా పిచ్చివారే అయ్యారు. ! కృష్ణయ్య శిఖి పింఛమును ,కౌస్తుభమణి, వైజయంతి మాల ,కస్తూరీ తిలకం ,ముంజేతి కంకణాలు ,నాసికను మెరిసే నవ మౌక్తికమును ,భుజంపై నుండి జాలువారిన జరీ ఉత్తరీయాన్ని ,కట్టిన పట్టు పీతాంబరాన్ని ,పాదాల శోభిల్లే మంజీరాలను,, మెడలో కాంతులీను స్వర్ణ ఆభరణాల భూషణాలతో ప్రకాశించే లీలామానుష విగ్రహ రూపిని,, నటనసూత్ర దారిని ,,భక్తుల చిత్తమనే నవనీతాన్ని దోచుకునే వెన్నదొంగను , కొంటె కృష్ణుని ,,వాని అద్భుతలీలలను వర్ణిస్తూ , తలచుకుంటూ, రోదిస్తూ ,ఆవేదనతో ఆందోళన చెందుతూ , తనగురించి వేదకడంలో ఉన్మాదస్థితి కి వెళ్లిన గోపికల కు రాసలీల వైభవం ద్వారా ఉద్దరిస్తూ,మరల తిరిగిరాని సాయుజ్యాన్ని , ప్రసాదించాడు నల్లనయ్య...! పరమాత్ముని కోసం ఏడవడం వల్ల వారి పాపాలు పోయాయి రాసలీల భాగ్యంతో పుణ్యాలు పోయాయి ! కనుక ఇక జన్మ రాహిత్యమైన ముక్తిమార్గాన్ని వారికి కరుణించాడు దేవకీ సుతుడు ! మనం పుట్టేముందు , అనుకోని మనతో తెచ్చుకున్న రంగు కాదు కదా ఈ నలుపురంగు..! నల్లజాతివారు మనలాంటి వారే కదా! ఆ మాటకొస్తే ఏదీ మనతో తెచ్చుకుంది కాదు ! "పాపపుణ్యాలు "అనే కావడికుండలు తప్ప.. ! అందుకే పదార్థాన్ని కాకుండా యదార్థాన్ని గ్రహించాలి ! సకల వేద శాస్త్ర సారం శ్రీకృష్ణ నామ స్మరణం ! శ్రీకృష్ణుని లీలలు మధురం! నామం మధురం ! రూపం మధురం! వేణువు మధురం! గోపీజనహృదయవిహారుని గానం మధురం !,, ధ్యానం మధురం ,!అతడి తలపు అతడిపై వలపు ,!మధురాతిమధురం! ,కృష్ణా! !ద్వారాకావాసా! భక్తజన మందారా ! నీలమోహనా !,రాధికాలోలా !,యమునతీర విహారా !,,బృందావన సంచారా ! ,,కృష్ణా ! నిన్ను దర్శించి ,తరించి శ్రీమద్భాగవత దశమ స్కంధం ద్వారా నీ బాల్యక్రీడల లీలలను అత్యద్భుత భక్తిప్రపత్తులతో దివ్యంగా రచించాడు ,బమ్మెర పోతనామాత్యుడు ! శ్రావ్యంగా సుమధురంగా కళ్ళకు కట్టినట్టుగా, ఎదుట శ్రీకృష్ణుని మనం చూస్తున్నట్టుగా ,రాసిన అందమైన "శ్రీ మద్ మహా భాగవత "పద్యాలు మనకు ఆనందాన్ని ,కృష్ణ భక్తి సామ్రాజ్యాన్ని అందిస్తున్నాయి ! ""నల్లనివాడు ,పద్మ నయనమ్ములవాడు ,కృపారసంబు పై జల్లేడువాడు ,,నవ్వు రాజిల్లేడి మోమువాడు !"...అంటూ తన దేవదేవుని పై గల భక్తి ప్రపత్తులు మరియు తన సహజ పాండిత్యం తో, శ్రీకృష్ణానుగ్రహం పొంది , మన అంతరాళంలో శ్రీకృష్ణ పరమాత్మ దివ్యదర్శన వైభవాన్ని అనుగ్రహించాడు భక్త పోతన. . ! ప్రేమైక స్వరూపిణి ,గోలోక సామ్రాజ్య రాజ్ఞి శ్రీ " రాధాదేవి ""గురించి చెప్పకపోతే ,"కృష్ణ "ప్రేమ " అసంపూర్ణంగా ఉంటుంది..!"" రాధ లేనిది కృష్ణుడు లేడు !" ,వారిద్దరి అనుబంధాన్ని మనకు రాధాకృష్ణులు గోపికలతో నడయాడిన బృందావనం , దివ్యక్షేత్రం తెలియజేస్తుంది.! అద్వైతప్రేమ మూర్తులు వారు! ."ప్రేమ " అనే పదానికి "పరాకాష్ట !" రాధాకృష్ణుల అనురాగ బంధం.! కృష్ణానుగ్రహం లభించాలంటే రాధమ్మ అనుమతి పొందాలి అట !.అపురూపమైన తన ప్రేమానుబందంతో అంత గా కృష్ణుణ్ణి తన ఆధీనంలో కి తెచ్చుకుంది రాధ ! అందుకే నల్లనయ్య ను అర్థం చేసుకున్నది , చేసుకో గలిగింది ,తనవాడిగా చేసింది ఆ రాధాదేవి ఒక్కతే ! ఆ విదంగా ,అమోఘమైన కృష్ణప్రేమలో కృష్ణదాసులై ,కృష్ణద్యాన గాన అమృత పానాన్ని తనివారా గ్రోలి ,జన్మలను ధన్యం చేసుకున్న శ్రీకృష్ణ భక్తులు అనేకం ఉన్నారు ! మీరాబాయి ,సూరదాసు,సదాశివ బ్రహ్మేంద్ర ,, శుకబ్రహ్మ , ,చైతన్య మహా ప్రభు.. అన్నమయ్య జయదేవుడు ,లాంటి వారు ఎందరో శ్రీకృష్ణ దివ్యచరణ కమల సేవలో జీవించి ,భజించి ,స్మరించి , సేవించి ధన్యులయ్యారు !" గోపాలకృష్ణ భగవాన్ కి జై ! జై శ్రీరాధే ! జై శ్రీకృష్ణ ! స్వస్తి !
Wednesday, November 14, 2018
చల్లనయ్య
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment