Dec 21, 2018
దైవభక్తి లో గోపికల భక్తి అత్యుత్తమం .అంటారు !.ఎందుకంటే "తనువు, మనసు ,ప్రాణము "" సర్వమ్ కృష్ణమయమే !అనుకుంటూ శ్రీకృష్ణుని స్మరిస్తూ ,దర్శిస్తూ భావిస్తూ ,సేవిస్తూ శ్రీకృష్ణ నామం జపిస్తూ. అహం కృష్ణా ! నేనే కృష్ణుణ్ణి ! అంటూ శ్రీకృష్ణ సాన్నిధ్యంలో ,కృష్ణ పరిశ్వంగంలో తన్మయులై తరించారు !ఉన్నట్టుండి ఒకేసారి ,తమ ప్రియతమ నాయకుడు, కృష్ణుడు కనపడకుండా పోతే , గోపికలు పిచ్చివాళ్ళవలె , ఉన్మాదంతో ,,శ్రీకృష్ణ విరహాన్ని , తాపాన్ని ,భరించలేక అంతటా వెదికే ప్రయత్నంలో నవవిధ భక్తులతో కృష్ణజీవనం అనుభవించారు ! ,కృష్ణుని రూపగుణ వైభవాలను ,మాటలను, చేష్టలను బాలకృష్ణుని లీలలను , నటిస్తూ , అభినయిస్తూ, తామే కృష్ణుని గా భావిస్తూ ,రసవంతంగా కృష్ణసౌందర్య అమృతతుల్య వైభవాన్ని వర్ణిస్తూ ,తన్మయతతో పారవశ్యతను అనుభవించారు. శ్రీకృష్ణ ఆధరామృతం గ్రోలాలని ఉవ్విళ్లూరారు. అంటే శ్రీకృష్ణుని పెదాలపై ముద్దు పెట్టాలన్న వాంఛతో కాదు..! శ్రీకృష్ణుని ఆధరాలు మధురం!. అధరాలపై కదిలే చిరునవ్వు మధురం..! రూపం , భావం ,శిఖిపించం. అన్నీమధురాలే..!కృష్ణయ్య నోటినుండి వచ్చే తీయని పలుకులు.. వాగామృతం కదా ! పండితులు వేదాంతులు కూడా మెచ్చుకుని ఆనందించే శ్రీకృష్ణలీలామృతం కూడా కన్నయ్య ఆధారామృతం కదా ! మరీ మరీ త్రాగాలనిపించే శ్రీకృష్ణ గానామృతం మధురం ! మధురాతిమధురం"! ముక్తిదాయకము ,సకల దుఃఖశమనము ,సర్వ పాపహరణము కృష్ణయ్య అనే పిలుపు లోని మధురభావన ! యోగులు సిద్ధులు ,పౌరాణికులు ,జ్ఞానులు ఇలా ఎందరో మహానుభావులు వెవేనోళ్ళ కొనియాడారు నందకిశోరుని చరితలను ,లీలలను భాగవతం లోని దశమస్కంధం లో బాలకృష్ణుని అద్భుతమైన బాల్య లీలలను వర్ణించి దర్శించి ,లిఖించి కృష్ణభక్తులను ధన్యులు గా చేశారు ! "నన్ను పొందాలంటే ముందుగా భక్తులు తమ "ఆత్మ సమర్పణ" చేసుకోవాలి !.అందుకు తమ లోనున్న అరిషడ్వర్గాలతో బాటు సకల సంపదలను," నాది! నేను !"అనే భావనలను తొలగించి, నాలో ఐక్యం చేసుకుంటాను. అందుకు యోగ్యత కోసం నేను పెట్టె పరీక్షలు కష్టాల రూపంలో వస్తాయి. గజేంద్రుని వలె ,ద్రౌపది వలె ,ప్రహ్లాదుని వలె ఎన్ని దురవస్థల పాలైనా కూడా ,నన్ను శరణాగతి కోరేవారు ,,నా భక్తులలో శ్రేష్ఠులు ! ఇలా నేను వారికి దూరంగా ఉండడం వలన.. గోపికల హృదయాల్లో నిండిన పరిపూర్ణ భక్తి,వారు పొందే విరహావేదన, శోకసంద్రంలో మునగడం తో పరాకాష్ట అవుతుంది.! వారి వేదనాభరిత శోకంతో గతజన్మ కర్మలు నశిస్తున్నాయి ! నన్ను ఆశ్రయించడానికి సంపూర్ణ సిద్ధిని ఇస్తున్నాయి !., ఇక రాధాదేవి అనుగ్రహం తో రాసలీల ద్వారా వారంతా నా గోలోకం లో చేరగలుగు తారు.!.."" అంటాడు శ్రీకృష్ణుడు .!.నిజమే కదా..! గోపికలంతా తమ సంపూర్ణ భారాన్ని ,నల్లనయ్య కు వదిలేసి, త్రికరణ శుద్దిగా భావించి సేవించి తరించారు..,!,ప్రతీ మనిషి తమ జీవితంలో భార్య భర్తపై, భర్త భార్య పై. మంగళసూత్రధారణతో,నమ్మకాన్ని పెంచుకుంటారు ! తోబుట్టువులు సోదరులపై , రక్షా ధారణతో ,వృద్ధులు తమ సంతానం పై మమకారం ,భరోసా తో నమ్మకం గా మనోధైర్యాన్ని పొందుతారు ," వీరు ,నావారు !నాకు ఎల్లప్పుడూ తోడు ఉంటూ నా యోగక్షేమాలు చూస్తారు !" అనుకుంటారు ,! కానీ ఇంతగా బందుబలగాన్ని ,ఐశ్వర్యాలను ,వీటిని అనుభవించే ఆరోగ్యాన్ని,స్తోమతను అనుగ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మ పైన మాత్రం తమ జీవితభారాన్ని మోపడానికి సందేహిస్తారు. ! నమ్మరు ! ఎందుకంటే గతజన్మ సంస్కారాలు అడ్డుపడుతాయి ,వివేకం ,విచక్షణ ,దైవ భావన లను కోల్పోతారు.. పశుత్వం నుండి మానవత్వం లభించింది ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల ! ఇక మానవత్వం నుండి దైవత్వాన్ని పొందాలంటే అందుకు దైవాన్ని ఆరాధించాలి సాధన ,చిత్తశుద్ధి ,భావ సంపద అత్యవసరం ! దైవం మనలోనే ఉంటూ కూడా జీవితచక్రాన్ని నడిపిస్తూ కూడా ,,అది సరిపోకుండా మన,ఎదుట. తల్లిగా ,తండ్రిగా ,కొడుకు ,కూతురు ,బంధువు ,స్నేహితులు ఇలా మన కుటుంబ పరివారం తో నిరంతరం ప్రత్యక్షంగా ఎదుట కనిపిస్తున్న వారంతా శ్రీకృష్ణ లీలావతారాలే కదా..! చెట్టు చేమలు, కొండలు కోనలు ,నదీ నదాలు సముద్రాలు ,పూవులు ,ఆకులు,, ఇలా సమస్త సృష్టికి సౌందర్య ప్రకృతికి మూలం తానై ,అద్భుతమైన ప్రకాశంతో ఆనందాన్ని పంచుతున్న పరమాత్మ ను విశ్వసించడానికి మాత్రం సంకోచిస్తున్నాం మనం...!!ఇదంతా ఈ కలియుగ మహాత్మ్యం.! దీనికి పరిష్కారం ఒకటే,,! నిరంతర హరినామ స్మరణ. సకల దోషాలను ,పూర్వజన్మ కర్మలను ,నశింపజేసి దివ్యమైన ఉత్కృష్టమైన మానవజన్మను ధన్యం చేస్తుంది !..శ్రీకృష్ణ భగవానుని భావించి సేవించే అర్హతను ఇస్తుంది..! అందుచేత ఈ క్షణం నుండి అనునిత్యం ""హరే కృష్ణ హరే కృష్ణా !"అంటూ బాహ్యములో భావంలో శ్రీకృష్ణ నామ మంత్రంకానీ ,"మహాదేవ మహాదేవా "అంటూ శివనామాన్ని గాన్ని జపించుదాం .!పరమాత్ముడు ప్రసాదించిన జన్మను సార్ధకం చేసుకుందాం!.. జై శ్రీకృష్ణ ! జై శ్రీరామ్ ! హరహర మహాదేవా !