Friday, September 14, 2018

అందాల రాముడు

"అందాల రాముడు . !ఇందీవర శ్యాముడు...!" అన్నట్టుగా "రామచక్కదనం " అన్న అందమైన పలుకు.. రామునికే చెల్లును.. ఆ చక్కదనానికే..ఆ సొగసులకే .ఆ చిరునగవులకే త్యాగరాజు అంతటి సంగీత కారుడు. రామునిపై తెగ ప్రేమను పెంచుకొని ఆయనపై భక్తి అనే వలలో చిక్కాడు..ఆరాధనతో అతిశయంతో.. పరవశత్వంలో అమృతధారలాంటి తన కీర్తనల్లో రాముని వైభవాన్ని రూపగుణ సౌందర్యాలను అపురూపంగా తెలుగులో లిఖించి, అందంగా స్వరాలను కూర్చి, తేనెలొలికే లలిత మైన పదాల సాహిత్య సంపదగా మనకు బహుకరించారు...! ఇలా తులసీదాసు ,భక్త కబీరు, శ్రీ రామదాసు లాంటి ఎందరో మహానుభావులు , భక్తులు రామనామ గానామృత వైభవంలో పులకించి తరించారు..! "పుంసాం మోహన రూపాయ.పుణ్య శ్లోకాయ మంగళం ! " అని వాల్మీకి మహాశయుడు తన రామాయణ కావ్యంలో..రాశాడు. పురుషులను కూడా మోహింప చేసే రామచక్కదనాన్ని అద్భుతంగా ఆలా ఒక్క మాటలో చెప్పాడు.. !శ్రీరామకుటుంబాన్ని మనకుటుంబానిగా భావిస్తూ వస్తున్న మన సనాతన వారసత్వ ధర్మానికి జోహారులు. !" ధర్మో రక్షతి రక్షితః !' అన్న నానుడి రామ చరిత వల్లనే ప్రాచుర్యం అయ్యింది..! నరుడిలా అవతరించి మనకోసం ఎన్నో కష్టాలను భరించి ధర్మాన్ని గెలిపించాడు...రామచంద్రుడు ! ఎన్నిసార్లు రామాయణం వినినా చదివినా గానం చేసినా.పాడినా తనివితీరదుకదా !ఆహా !ఇక. భక్తి శ్రద్ధలతో వినే వారిలో ఇంకా ఆ ఆనందం తాదాత్మ్యం ఇంతింతై వటుడింత యై అన్నట్లుగా రెట్టింపు ఉత్సాహం మానవజీవన సాఫల్యతగుణం ..నడవడిలో ఔన్నత్యం పెరుగుతాయి.. అందుకే మనిషి గా పుట్టాక మన నడవడి ఇతరుల జీవనానికి ఒరవడి కావాలని రామకథ బోధిస్తుంది...! భద్రాచలం క్షేత్రంలో మనం దర్శించే లక్ష్మణ సహిత సీతారాముల విగ్రహాల అపురూపశిల్ప లావణ్యం దివ్యం.! వర్ణనాతీతం.! మధురాతిమధురం!.దేవాలయ గర్భగుడిలో కొలువై ఉన్న రాజారామ చంద్ర ప్రభువు అందచందాలను వీక్షించడంలో. అలౌకిక అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తాం. !. ఈ మాంసపు నేత్రాలు సరిపోవు.!. ఎంతచూసినా ఇంకా చూడాలనే సౌందర్యం రామయ్యది..! రాక్షసుడైన రావణుని కూడా సమ్మోహనపరచి వివశుడిని చేసిన కోటిసూర్య ప్రకాశ తేజోపుంజం , ఆ పర బ్రహ్మ స్వరూపం..! చుట్టూ అందమైన ప్రకృతి శోభలతో , స్వచ్చంగా ప్రవహించే పరమ పవిత్ర గోదావరీ జలధారల వైభవంతో, ఎంతో సుందరంగా మనోహరంగా స్వర్ణ కాంతుల ప్రకాశంతో. మనోఙ్ఞన్గా. అగుపిస్తోంది ఈ క్షేత్రం ..!మన అంతరాళంలో ఆ సౌందర్య రాశి..ఆ రామచక్కదనం అందంగా కదుల్తూ ఆనందాన్ని కలిగిస్తుంది.!. రామ సౌందర్యమే ఇంత అందాన్ని ఆనందాన్ని కలిగిస్తుంటే ఇక రామనామ వైభవాన్ని వర్ణించతరమా ! శ్రీరామచంద్రుని శక్తి కంటే రామ నామానికే అద్భుతమైన ప్రభావం ఉందని ఎందరో రామభక్తుల ప్రసిద్ధిని కీర్తిని చూస్తే తెలుస్తోంది.. రామ భక్తాగ్రేసరుడు ఆంజనేయుడు త్రేతాయుగం నాటి తన ప్రభువుకీర్తిని రామనామ గాన వైభవంతో చిరంజీవి యై ఈ యుగంలో కూడా ఊరూరా ఖండాంతరాలలో కూడా దశదిశలా వ్యాపింప జేస్తున్నాడు ! శ్రీరామ సాక్షాత్కారం పొందిన పోతన ,భద్రుడు , తులసీదాసు , శ్రీరామ దాసులవంటి ఎందరో రామభక్తులు కేవలం రామనామ గాన ప్రభావంతో మానవజాతి ని భక్త్తమార్గంలో సన్మార్గంతో నడిపిస్తూ మానవజన్మ ను ఉద్దరిస్తూ వచ్చారు. ఇదీ మన సాకేతరాముని మర్యాద పురుషోత్తముని సీతారాముని ఆనందామృత అపురూప అద్భుత చరితం.. అదిశేషునికైనా ఆదిిదేవునికైనా బ్రహ్మకు నైనా రాముని గుణసంపద శీల వైభవము పరాక్రమము ఆదర్శము ..షోడశ గుణ సంపన్నుని పొగడుటకు తరముగాదు కదా ! శ్రీ. రామచంద్రా.!సద్గుణ సాంద్ర ! జగదానంద కారకా..! నీ స్మరణ మధురం ! నీ కీర్తన మధురం.! నీ తలపు నీపై వలపు.. నీ రూప గుణ నామ వైభవం మధురాతిమధురం.! జానకిరామా. !పట్టాభిరామా ! పావననామా !.ఈ ఆనందాన్ని ఇలానే కరుణించి శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించు !.రామదాసులకు దాసానుదాసునిగా, ఆ దాసుల పదరేణువుగా ,నీ సేవ చేసుకొనే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రీ..!శ్రీ సీతారామచంద్ర స్వామీ ! ఇంతకన్నా ఆనంద మేమి. ఓ రామ శ్రీరామ ....!"..జై శ్రీరామ్ !జై జై శ్రీరామ్ !"

పదండి ముందుకు

ఉపాధ్యాయునిగా రాగంపేట high school లో పనిచేస్తున్నప్పుడు, పదవ తరగతి పిల్లలు. తమకోసం ప్రత్యేకంగా ఒక డ్రామా రాయమని నన్ను అడిగారు1982 లో...!అప్పుడు " పదండి ముందుకు !"అనే సాంఘిక నాటకం రాశాను.. అందులో ఒక యువకుడు తన అభ్యుదయ భావాలతో. తన స్వంత ఊరిని సంస్కరిస్తాడు. తన స్నేహితులతో కలిసి. ఒక team గా ఏర్పాటు చేసి తోటివారి కనీస అవసరాలు తీరుస్తాడు .విద్య, వైద్యం,రవాణా ,వ్యవసాయ ఇబ్బందులను అందరితో చర్చించి సామూహికంగా కదిలి. గ్రామస్తులను ఒక్క త్రాటిపై నడిపిస్తాడు ..ఇది సర్పంచ్ గా ఉన్న జమీందారుకు నచ్చదు ,అయినా అతడి బెదిరింపులకు భయపడకుండా మంచితనంతో. తెలివిగా. అతడు చేసే లోపాలు పొరబాట్లు. చూపుతూ, అతడి దౌర్జన్యాలు అన్యాయాలను సంఘటితం గా పోరాడి ,అతడికి కనువిప్పు కలిగిస్తాడు . ! ఇందులో.హింస లేదు,! కొట్లాటలు లేవు,!గుండాయిజం లేదు .!ప్రశాంత విప్లవం తో ,తన ఆదర్శభావాలతో, సర్పంచ్ గా నెగ్గుతాడు. !విద్యుత్తు రోడ్లు. పరిశుభ్రత. లాంటి ఆధునీకరణ తో ఉత్తమ సర్పంచ్ గా పేరు సంపాదించడం ,అదే జమీందారు కూతురుని పెళ్లి చేసుకోవడం తో. కథ సుఖాంతం అవుతుంది.....!" ఇదీ కథ సారాంశం..! అయితే అప్పుడు గ్రామాలలో ఫోన్లు సినిమాలు టీవీ లు లేవు..! కరెంట్ కనెక్షన్లు్ కూడా తక్కువే ఉండేవి..మా స్కూల్ compound లో బల్లలు వేసి. stage తయారు చేశాము..రాత్రి 7pm నుండి 10pm వరకు మూడుగంటలు పెట్రోమాక్స్ లైట్లు 5,,పెట్టి 20 మంది విద్యార్థులతో , ఉపాధ్యాయుల సహకారం తో , పాటలు గానీ డాన్సులు గానీ లేకుండా చక్కని సంభాషణలు వారి నటనకు జోడించి.. విజయవంతంగా చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు గ్రామస్తుల ముందు ప్రదర్శించాము .ప్రక్క పాఠశాలలవారు కూడా ఇది విని మా స్కూల్ లో వేయమంటే అక్కడా చేశాము ..అలా..అందరూ మెచ్చుకునే రీతిలో పిల్లలు అద్భుతంగా నటించి,తమ తమ పాత్రలకు న్యాయం చేశారు..డ్రామా రాయడమే నా వంతు.. కానీ తీర్చిదిద్దే వంతు మా తోటి ఉపాధ్యాయులదే అయ్యింది.. ఆదరించిన గ్రామస్తులకు, పిల్లలచేత పలికించి నటింపజేసినమా teaching staff,Headmaster గారలకు సర్వదా కృతజ్ఞుడిని...అవుతున్నాను !..... అయితే ఇక్కడితో కథ అయిపోలేదు.!. అసలు కథ ప్రారంభమే ఇప్పుడు,!" 36 సంవత్సరాల సేవాకాలం తర్వాత ,,నేను,2004 లో retirement తీసుకున్నాను..! ఒకరోజు .గుండి high school మాజీ SSC విద్యార్థుల సమావేశానికి . ఆ సంవత్సరంలో తమకు చదువు చెప్పిన విశ్రాంత ఉపాధ్యాయులను ఆహ్వానించారు.!. అందులో నేను ఒక్కణ్ణి..! సన్మానాలు అయ్యాక ఆ ఊరి గ్రామ యువకులు. జిల్లాలో ఉత్తమ సర్పంచ్ గా అవార్డ్ అందుకున్న యువకున్ని సాదరంగా అభిమానంతో స్టేజి మీదకు ఆహ్వానించి సన్మానించారు.. !అప్పుడు ఆ యువకుడు తన సందేశాన్ని వినిపించేందుకు ముందుగా. ఇలా అన్నాడు.." నేను ఉత్తమ సర్పంచ్ గా ప్రభుత్వంతో ఎన్నికైనందుకు నాకు గర్వన్గా ఉంది. ఈ పేరు నాకు రావడానికి సహకరించిన నా గ్రామస్తుల ప్రోత్సాహానికి సహకారానికి సంతోషంగా కూడా ఉంది.. అయితే నేను సర్పంచ్ కావడానికి నా గ్రామానికి ఎదో రకంగా సేవ చేయాలన్న దృఢ సంకల్పాన్ని కలిగించి ,ఆ ఆదర్శ భావాలను నా విద్యార్థిదశలోనే నాటి,, మా కోసం "పదండి ముందుకు " అనే సాంఘిక నాటకం రాసి. అందులో నన్ను ఉత్తమ సర్పంచ్ గా వ్యక్తిత్వాన్ని పెంచి, మీ ముందు ఇప్పుడు తలెత్తుకొని గర్వన్గా నిలబడే ఉన్నతస్థాయిలో పదవిలో నిలబెట్టాడు మా గురువుగారు ,మనోహర రావు గారు ! .".సర్పంచ్ " అనే శిల్పాన్ని చక్కగా చెక్కి అందంగా అందరికి అందుబాటులో ఉండేలా చేశాడు ఆయన.. ఆనాడే నన్ను "ఉత్తమ సర్పంచ్ " చేశాడు ఆయన.. ఇప్పుడు కొత్తగా నేను అయ్యింది ఏమీ లేదు.. అలా చేయకపోతే నేను ఇలా మీ ముందు ఆదర్శ ప్రజాప్రతినిధిగా నిలబడేవాడిని కాదు... మీ అందరికి గ్రామానికి సేవ చేసే భాగ్యం అబ్బేది కాదు. !అదొక అదృష్టం అయితే , మరొక అదృష్టం ఏమిటంటే .ఆ విధంగా సామాజిక దృక్పతం తో డ్రామా రాసి నాతో మంచిపనులు చేయించిన ఉపాధ్యాయుడు ప్రత్యక్షంగా నాకు ఎదురుగా కూర్చుండి ఉండడం, ! , వారి ఎదుట నాకీ సత్కారం జరగడం నా అదృష్టం !..నిజానికి ఈ సత్కారం వారికి చెందాలి...!" అంటూ కిందికి దిగి వచ్చి నాకు నమస్కరించి . నన్ను పైకి తీసుకెళ్లి సభకు నన్ను పరిచయం చేసి అదే పూలదండను నా మెడలో వేసి. ఆదే శాలువాను నాకు కప్పాడు.!.. అంతే కాదు తాను నా కాళ్ళకు వంగి దండం పెట్టాడు ..సభలో చప్పట్లు. సంతోషంతో నా కళ్ళనుండి ఆనంద భాష్పాలు జలజలా రాలాయి నా కళ్ళనుండి.. ఆనందంతో మాటలు తడబడ్డాయి.. గుండెలు పొంగే పట్టరాని భావాలు.. ఉపాధ్యాయనిగా నేను పొందిన వృత్తిపరంగా సంతృప్తి అందించిన ఆ భగ వంతునికి శతకోటి ప్రణామాలు సమర్పించడం తప్ప..ఇంతగొప్ప అనుభూతిని బ్రహ్మానందాన్ని అనుగ్రహించిన ఆ దైవానికి ప్రతిగా ఏమిచ్చి రుణం తీర్చుకోగలం...ఇది నిజంగా జరిగిన వాస్తవ గాథ.. ఒక సినిమాలో చూపించే మధురమైన సన్నివేశంలా తోచింది ఇందులో సర్పంచ్ పేరు చెప్పనేలేదు కదా.. అతడు మరెవరో కాదు ! అతడిపేరు "భద్రేశం!" తెలంగాణ వాసి. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం లోని దేశరాజు పల్లె అనే గ్రామంలో పదిమందికి ఉపకారం సహాయం చేసే మానవతా దృక్పథంతో నిరంతరం గ్రామస్తులందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటున్నాడు !. .అదే సౌజన్యం !అదే ఉత్సాహం ! అదే చెదరని చిరునవ్వు.! "" .ఎప్పుడూ మీ ముందు నేను విద్యార్థినే. !ఇంకా ఎంతో నేర్చుకోవాలి.. !ఎంతో చేయాలి! ఈ గుర్తింపు అభివృద్ధి లకు కారణం ఆనాడు విద్యను చిత్తశుద్ధితో మాకు అందించిన గురువుల అనుగ్రహమే. !" అంటాడు.. అప్పటినుండి ఇంకా ఉత్సాహంగా గ్రామంలో సేవలు చేస్తూ ప్రజాదరణ పొందుతూ ఉన్నాడు.. ఎప్పుడు నన్ను కలిసినా చిరునవ్వుతో నమస్కారం చేస్తూ " మీకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నాకు ఒక్క ఫోన్ చేయండి. ఎలాంటి సమస్య అయినా పని అయినా నేను చేసి పెడతాను .సార్ !" అంటాడు.. ఇదీ అతడి నమ్రతకు వినయ విధేయతకు ఉత్తమ సంస్కారానికి విద్యార్థికి తన గురువుగారి పట్ల ఉండే గౌరవ భావాలకు ప్రతీక రిటైర్ అయ్యాక కూడా తమ గురువులను మరవకుండా , గుర్తిస్తూ తమ ప్రతిభకు యశస్సుకు కారకులని భావించి ,ఎక్కడైనా వారు త్రోవలో కలిసినప్పుడు. కృతజ్ఞతతో వంగి చేతులు జోడించి వందనం చేస్తున్న ఇలాంటి మంచి విద్యార్థులను కలిగిన ఉపాధ్యాయుల జన్మ నిజంగా ధన్యం .! పవిత్రమైన బోధనా వృత్తి దివ్యం !అద్భుతం . ! సఫలం !. నిజాయితీతో అంకితభావం తో ,ఇతరుల సంక్షేమం కోసం చేసే ఏ వృత్తిలో నైనా సంతృప్తి నిజమైన ఆనందం ఉంటుంది..! అందులో ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది.!. పిల్లల బంగారు భవితను సరిదిద్ది ఉత్తమ పౌరునిగా మలచడం ద్వారా పొందే సార్థకత లోని ఆనందం అమూల్యము.! అపురూపం !అమోఘం !పరమ పవిత్రమైన అధ్యాపక వృత్తిని అందించి.. విద్యార్థులకు స్ఫూర్తినీ చక్కని భవిష్యత్తును ఏర్పరచడానికి అవకాశం అనుగ్రహించిన దేవదేవునికి హృదయపూర్వక ధన్యవాదములు.. సాష్టాంగప్రణామాలు.. సరస్వతీ మాత చదువుల తల్లి విద్యాలక్ష్మీ కి నమస్సులు..

స్వామి

కోటి మన్మధకారుడు, జగన్మోహనుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు,, ఆదిదేవుడు,, శరణాగత వత్సలుడు,, సర్వలోక శుభంకరుడు,,కలియుగ దైవము,, అలిమేలుమంగా సహిత శ్రీ వేంకటేశ్వరుడు, ఎదుకొండవాని గా ప్రసిద్ధిగాంచిన ఆశ్రీత వత్సలుడు,, పరమ దయాలువు,, శ్రీకృష్ణ భగవానుని ప్రతి రూపముగా వెలిసిన తెలుగువారి ఇలవేలుపు మన వెంకన్న స్వామి లీలలు, ప్రాభవం, వైభవం, మహత్తు,, ఎవరినీ వర్ణింప తరము కాదు.. స్వయంభువు గా సకల మానవాళిని ఉద్ధరించడాని కి ప్రత్యక్ష కలియుగ దైవంగా ఇలలో ,వెలిసిన వెంకటేశుని అందమైన ఆనందకరమైన దివ్యమైన మోహనకారము ఎంత చూసినా ఎన్నిమారులు చూసినా,, తనివి తీరదు,,చూడాలన్న ఆశ చావదు, స్వామి ఆరాధనా ఫలాలను అరగించాలంటే, ఆసక్తి, తపన ,తత్వాన్ని నిత్యం మననం చేయడం , ఆర్ద్రత ,మాత్రమే కాదు ,,అవి మనలో మనసులో నింపి ,స్మరించి,జపించి ,సేవించి, తరించే,భాగ్యాన్ని ,ఆ స్ఫూర్తిని అనుగ్రహించమని స్వామిని వేసుకోవాలి , స్వామి కరుణతో, దయతో, మాత్రమే స్వామిని నిజ దర్శనం చేయగలం,,

జగన్నాటకం

ప్రతీ పదములో,ప్రతీ ఆలోచన, పనీ, కార్యక్రమంలో పరందాముని పర తత్వాన్ని దర్శించే ప్రయత్నం చేయడం, కూడా పరమేశ్వరానుగ్రహమే కదా,, ఈశ్వరా,, ఎన్నో పనులు చేయడానికి టైం, ఓపిక,డబ్బు,, తపన ఉంటాయి, కానీ 24 గంటల్లో నిన్ను తలిచే ఓపికగాని తీరికగాని సమయం గాని ఉండడం లేదు,, తండ్రీ, ఏమిటీ మాయ, ఎందుకీ లీల,, ఈ పరీక్ష,, ఈ జగన్నాటకం,ఈ తోలుబొమ్మలాట..గోవిందా, నీ తలపు మధురం నీ రూపం, నామం మధురాతిమధురం... నారాయణా, నీ నామమే గతి ఇక.. కోరికలు మాకు కొనసాగుటకు.....

పంచుకో

మా అమ్మ అరటిపండు ను ముక్కలు చేసి అందరికి ఇస్తూ చివరికి మిగిలిన భాగాన్ని నోట్లో వేసుకునేది... పళ్లకు అంటకుండా.. చూస్తే నోరూరి తినాలని అనిపించే మామిడి పండ్లని బ్రహ్మణుడికో ముత్తైదువ కో పిల్లలకు ఇచ్చేసేది... ఉంచుకోడం లోకన్నా,, పంచుకోడంలో ఎక్కువగా ఆనందాన్ని తృప్తినీ పొందేది. పరమాత్మ తత్వ చింతనతో.మనసు పండితేనే అలాంటి నిష్కామ ప్రవృత్తి అలవడుతుంది కదా .హరే కృష్ణ.......

శరణాగతి

శరణాగతి అంటే ఇలా ఉంటుందేమో. !---- .శరీరమే గుడి,,! తలయే శిఖరం,,! హృదయమే శ్రీహరికి పీఠం,, కంటి చూపులే దీపాలు,!, లోన ఉన్న అంతర్యామిని ఆత్మలో దర్శించడానికి ,,,! ఇక పలుకులే మంత్రములు,,! ఇంపైన నాలుకే గణ గణ మ్రోగు జేగంట !,,భుజించే ఆహారంలో ని రుచులే నైవేద్యాలు గా లోన ఉన్న దైవానికి "అని తలవాలి...! 

అంతే గాక , తన కాలినడకలే స్వామికి అంగరంగ వైభవంగా జరిపే ఊరేగింపులు " ,అనుకుంటూ భావించి జీవించే జీవుడు నిజమైన దాసుడు,!,కాగా తాను చేసే "ఉఛ్వాస నిశ్వాస క్రియలే శ్రీవారికి ఊంజల సేవ ""గా అనుభవిస్తూన్న భావసంపదను "నిత్యపూజ "గా స్వామికి, సేవిస్తూ సమర్పిస్తే ఈ "వైభవాన్ని" స్వీకరించడానికి పరమాత్ముడు ప్రత్యక్షంగా దిగివచ్చి భక్తునికి పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు, అనడానికి అన్నమయ్య, పోతన, శ్రీరామదాసు, మీరాబాయి, త్యాగరాజు లాంటి ఎందరో మహానుభావులు , భక్తశిఖామణులు మన భారతావని లో కీర్తింపబడుతూ ఉన్నారు.. 

"నీవే తప్ప ఇతః పరంబెరుగ. మన్నింపన్ దగున్ దీనునిన్ .....! " ఆలాంటి శరణాగతి లో అద్భుతమైన అనిర్వచనీయమైన బ్రహ్మానందాన్ని, అనుభవించారు..వారు !"""ఎంతో రుచిరా. శ్రీ రామ. నీ నామమెంతో రుచిరా!",అంటూ ఆనందపారవశ్యంతో జీవితాన్ని భక్తితత్పరతతో పండించి పరమాత్మను చిత్తశుద్ధితో సేవించి తరించారు ...!" ఇంతకన్నా ఆనందం ఉంటుందా..!" జై శ్రీరామ్..!


ఉపాధ్యాయులు

ఉపాధ్యాయులు నిజంగా అదృష్టవంతులు.! నాడు, నేడు, ఏనాడైనా....! గుర్తింపు, గౌరవం, సమాజసేవకు తగిన అవకాశం, అంకితభావం,నిరంతర అధ్యయనం, జ్ఞాన సముపార్జన, కొంతమంది కి వేదికపై చెప్పగలను ! అన్న దైర్యం, గర్వం, అభిమానం,, ఆదరణ, ఆనందం,పిల్లలతో మమేకమై, పెద్దరికం మరచి, బాల్య వైభవాన్ని అందుకునే మదురక్షణాలు, ! ,ఇలా ఎన్నో ఉత్తమమైన మానవతా, ధార్మిక, నీతి విలువలు అందించే భాగ్యం ఈ వృత్తిలో ఉంది. అన్నింటికీమించి job satisfaction, అద్భుతంగా ఉంటుంది, రిటైర్మెంట్ అయ్యాక కూడా ఎదురొచ్చి గుర్తించి, పరిచయం చేసుకొంటూ , గడచిన అనుభవాలను గుర్తు చేస్తూ , తమ అభ్యున్నతి కి కారణం మీరే మేష్టారూ !అంటూ వినయంగా నమస్కారం చేస్తూ వెళ్లిపోయే శిష్యులు సంప్రదాయానుసారంగా చేసే అభివాదం ,,చాలదా దేవుడిచ్చిన వరం ఫలించింది అనడానికి,!! వృత్తికి న్యాయం చేశాను అని అనడానికి...!

A Drama that became Real!

The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...